నిజామాబాద్, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో నీటి పారుదల, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక, ఉద్యానవన తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఎడతెరపిలేని వర్షాల వల్ల ఇప్పటివరకు ఎన్ని చెరువులలో వర్షపు జలాలు వచ్చి చేరాయి, ఎన్ని చెరువులు పూర్తి స్థాయి నీటిమట్టాన్ని సంతరించుకున్నాయి, వాగులు, కాల్వల పరిస్థితి ఏమిటి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెండోరా మండలం పోచంపాడ్ లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద ప్రవాహం, రిజర్వాయర్ నీటిమట్టం గురించి ఆరా తీశారు. వర్షాలతో పంటలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అని అడిగి తెలుసుకున్నారు.
పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. అయితే మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా, అప్రమత్తతో కూడిన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు హితవు పలికారు. ముఖ్యంగా చెరువులకు గండ్లు పడకుండా నీటి నిల్వలను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, చేపల వేటకు ప్రజలెవరూ వెళ్లకుండా చూడాలన్నారు. అలాగే యువత, పిల్లలు ఈత సరదా కోసం చెరువులు, కాల్వలలోకి దిగకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు.
ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలు ఎవరు కూడా విద్యుత్ వైర్లను తాకకూడదని, కరెంటు స్తంభాల వద్దకు వెళ్ళవద్దని కలెక్టర్ హితవు పలికారు. భారీ వర్షాల తాకిడితో ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే తక్షణమే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08462 – 220183 కు సమాచారం అందించాలని సూచించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నీటి పారుదల శాఖ ఎస్.ఈలు బద్రీనారాయణ, శ్రీనివాస్, డీ.ఈ ప్రవీణ్, సీపీఓ బాబురావు, వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, డీపీఓ జయసుధ, పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథచారి, పంచాయతీ రాజ్ ఈ.ఈలు భావన్నా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.