జక్రాన్‌పల్లి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగులను మభ్య పెట్టడానికే ఐటిహబ్ పేరుతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పరి వినోద్ విమర్శించారు. జక్రాన్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జక్రాన్‌పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పరీ వినోద్ మాట్లాడారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ యువత కోసం బిఆర్‌ఎస్ ప్రకటించిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేసిందని వాటి నుండి నిజామాబాద్ రూరల్ యువత దృష్టి మరలచడానికే ఐటి హబ్ పేరుతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయకుండా అసలు ప్రారంభమే కానీ ఐటిహబ్‌లో ప్రైవేట్ కంపెనీల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామనడం నిజంగా హాస్యాస్పదమని, జాబ్ మేళాలో ఏ ఏ కంపెనీలు పాల్గొంటున్నాయో అసలు కంపెనీలు ఎన్ని సంవత్సరాల అగ్రిమెంట్ ప్రతిపాదికన ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయో ఏమి చెప్పకుండా కేవలం జాబ్‌మేళా కోసం విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ యువతను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిన బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై యువత ఆగ్రహంతో ఊగిపోతుందని ఇప్పుడు మరోసారి యువతను మోసం చేసే ప్రక్రియలో భాగంగానే ఐటిహబ్‌లు ప్రైవేట్ జాబ్ మేళాల పేరుతో ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. జాబ్‌మేళాలో ఉద్యోగం పొందిన నిరుద్యోగులు కేవలం ఎన్నికల అయిపోయే వరకే ఉద్యోగంలో ఉంటారని తర్వాత ఆయా కంపెనీలు చేతులెత్తేస్తాయని తర్వాత కంపెనీలో ఉద్యోగాలు పొందిన యువత భవిష్యత్ అయోమయంలో పడుతుందని, జాబ్ మేళాలో ఉద్యోగం పేరుతో వచ్చే యువత యొక్క డేటా సేకరించి ఎన్నికలవేళ వారిని ప్రలోభపెట్టే ఆలోచనలో భాగంగానే ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
జాబ్ మేళా నిర్వహించే ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ప్రగల్బాలు పలుకుతున్న టాస్క్ ద్వారా రూరల్‌లో ఎంతమంది యువతకు ఉద్యోగ నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారికి ఎక్కడెక్కడ ఉద్యోగాలు కల్పించారో తెలియజేయాలని ఆయన అన్నారు. యువతకు ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించడం పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని కేవలం 9 సంవత్సరాలు పాలనలో ఇప్పుడే ఎందుకు ఐటీహబ్‌ల పేరుతో హడావిడి చేస్తున్నారని ఇలాంటి జాబ్ మేళాలు 9 సంవత్సరాల కాలంలో ఎందుకు నిర్వహించలేదని తాము బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులను, నాయకులను ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిరుద్యోగులు వారిని నమ్మే పరిస్థితి లేదని, 9 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో యువత మరియు నిరుద్యోగులే ఘోరి కడతారని అన్నారు. కార్యక్రమంలో రూరల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్, ప్రశాంత్, ప్రేమ్ కుమార్, యువజన నాయకులు పాల్గొన్నారు.