వేల్పూర్, జూలై 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చే నెలలో(ఆగస్టు) అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో నిర్మాణం పూర్తి అయిన,చివరి దశలో ఉన్న,పురోగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై శుక్రవారం నాడు ఆర్డీవో, అన్ని మండలాల తహిసిల్దార్లతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.
నిర్మాణం పూర్తి అయిన,పురోగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల వివరాలు మండలాల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతర్గత సి.సి రోడ్లు,డ్రైన్లు,డ్రిరకింగ్ వాటర్,ఎలక్ట్రిసిటీ ఇతర మౌళిక సదుపాయాల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేసారు. ఫినిషింగ్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లతో పాటు,నిర్మాణ చివరి దశలో ఉన్న ఇండ్లు ఈ నెల ఆఖరు వరకు సిద్దం చేసి ఆగస్టులో లబ్ధిదారులకు పంపిణీ చేసేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని మంత్రి మరోమారు అధికారులకు స్పష్టం చేశారు.
సమీక్షలో ఆర్డీవో వినోద్ కుమార్,బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల తహశీల్దార్లు,ఆర్ అండ్ బి ఎ.ఈ నర్సయ్య,మంత్రి ఓఎస్డి విజేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు కోటపాటి నర్సింహనాయుడు, బద్ధం ప్రవీణ్ రెడ్డి, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.