నిజామాబాద్, జూలై 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పిసిపిఎన్‌డిటి జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం డాక్టర్ ఎం సుదర్శనం అధ్యక్షతన ఐడిఓసి లోని డిఎంహెచ్‌ఓ ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, గర్భిణీ స్త్రీగా రిజిస్టర్ అయిన నాటినుండే ఆశాలు, ఏఎన్‌ఎంల ద్వారా నిఘాని తీవ్రంచేసి అబార్షన్లు లేదా భ్రూణహత్యలు జరగకుండా ఆశాల ద్వారా ఫాలోఅప్ చేయాలని కోరారు.
అదేవిధంగా ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఉన్న తల్లులని గర్భం దాల్చిన తర్వాత నుండి ప్రసవించేంత వరకు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా అబార్షన్లు లేదా భ్రూణ హత్యలు జరగకుండా చూడాలని ఎవరైనా ఆర్‌ఎంపీలు స్కానింగ్ సెంటర్ లతో కుమ్మక్కై డబ్బు కోసం కక్కుర్తి పడి భ్రూణ హత్యలకు పాల్పడేలాగా ప్రోత్సహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా బ్రూణహత్యలకు పాల్పడిన వైద్యులపై మరియు గర్భిణీ స్త్రీలను స్కానింగ్ చేసిన తర్వాత ఆడా లేదా మగ శిశువు అని తెలియజేసిన స్కానింగ్ సెంటర్లపై పిసిపిఎన్‌డిటి ఆక్ట్ 1994 రూల్స్ 1996 కి అనుగుణంగా వారిపై కఠిన చర్యలు తీసుకోని ఆ స్కానింగ్ సెంటర్లను మూసివేయడం జరుగుతుందన్నారు.
సమావేశంలో కమిటీ సభ్యులు సూచించిన వివిధ సూచనలు అన్నీ కూడా రాబోయే సమావేశం వరకు అమలు చేసి జిల్లాలో భ్రూణ హత్యలు జరగకుండా చూడడమే కాకుండా, లింగ నిష్పత్తి తగ్గకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ గారు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి రాజేష్, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, రేడియాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్, గైనకాలజిస్ట్ డాక్టర్ రోహిణి, పీడియాట్రిషన్ డాక్టర్ నవీన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ,డెమో బి గంగాధర్, ఆరోగ్య చైతన్య వేదిక కన్వీనర్ మరియు డిహెచ్‌ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మహిళా సంఘం ఎన్జీవోనుండి పద్మాసింగ్, మెప్మా నుండి మాధురి, హెచ్ ఈ రమ, డీఈవో దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.