నిజామాబాద్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులు, గర్భిణీ మహిళలకు నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆగస్టు 7 వ తేదీ నుండి మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులు, గర్భిణీ మహిళలకు అవసరమైన వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుతోందన్నారు.
వివిధ కారణాల వల్ల ఎవరైనా టీకాలు తీసుకోకుండా తప్పిపోయినట్లైతే, అలాంటి వారిని గుర్తించి వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించేందుకు మూడు విడతలుగా మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని డీ ఎం హెచ్ ఓ వివరించారు. మొదటి విడతగా ఆగస్టు 7 నుండి 12 వ తేదీ వరకు, రెండవ విడతగా సెప్టెంబర్ 11 నుండి 16 వ తేదీ వరకు, మూడవ విడతగా అక్టోబర్ 9 నుండి 14 వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనుష్ కొనసాగుతుందని తెలిపారు.
ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ, టీకాలు వేయించుకొని చిన్నారులు, గర్భిణీలను గుర్తించి వ్యాక్సిన్ లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇళ్లకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని, జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ లక్ష్యసాధనకు తోడ్పాటును అందించాలని డీఎంహెచ్‌ఓ కోరారు.