ఎల్లారెడ్డి, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగరెడ్డి పేట దగ్గర ఉన్న పల్లె దావఖానను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్ సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు తీసుకువచ్చి ప్రారంభించి నేటికి నెల రోజులు గడుస్తున్నా ఏ ఒక్క రోజు కూడా ఆసుపత్రి తెరవకుండా ప్రజలకు వైద్యం అందించడం లేదన్నారు. ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుందన్నారు. ఇలాగైతే సామాన్య ప్రజలకు వైద్యం ఎలా దక్కుతుందని అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి పల్లె బస్తీ దవాఖాన పేరుతో హాస్పిటల్ నిర్మించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిరదని ఇప్పటివరకు దీనిని ప్రారంభించకుండా వైద్యులను కేటాయించకుండా కాలయాపన చేస్తుందన్నారు. పేద ప్రజలకు సరైన వైద్యం అందక గ్రామాలలో చాలామంది రోగాల పాలవుతూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తూ అప్పుల బారిన పడుతున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే వీటిని ప్రారంభించాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామన్నారు.