నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ బుధవారం రాత్రి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్, ఆర్టీసీ, ఇరిగేషన్, వైద్యారోగ్యం తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, వాగులు, కుంటల్లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా కార్య స్థానాల్లో ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలించి సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.
ఎక్కడైనా వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సమాచారం అందించాల్సిందిగా స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించాలని కలెక్టర్ అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్ళలో నివాసాలు ఉంటున్న వారితో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. సహాయక చర్యలకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల వద్ద బస్సులు జాగ్రత్తగా నడిపేలా ఆర్టీసీ డ్రైవర్లను అప్రమత్తం చేయాలని ఆర్‌ఎంకు సూచించారు.
కలెక్టరేట్ తో పాటు ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లు 24 గంటల పాటు పనిచేసేలా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ఏదైనా సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. ఏ చిన్న నిర్లక్ష్యానికి సైతం తావివ్వకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం వచ్చి చేరుతున్నందున శ్రీరాంసాగర్ జలాశయంలో గణనీయంగా నీటిమట్టం పెరుగుతోందన్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని దిగువ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు.
సెల్ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు.