నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం స్థానిక నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ముస్కాన్‌పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి హాజరై మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలని గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు పిల్లలతో పనిచేయిస్తున్నటువంటి యాజమాన్యాలను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కచ్చితంగా బడిలో ఉండేటట్టు చూడాలని తెలిపారు. పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న, పని చేయిస్తున్న, వీధి బాలలను గుర్తించి వారిని బడిలో పంపించాల్సిన బాధ్యత మన పైన ఉందని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఇప్పటివరకు 52 మంది పిల్లలని గుర్తించడం జరిగిందని, పిల్లలని మరియు తల్లిదండ్రులను కౌన్సిలింగ్ నిర్వహించి బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి షేక్ రసూల్ బి తెలిపారు.
జిల్లాల్లో 3 డివిజన్లో మూడు టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతిరోజు బస్టాండు రైల్వే స్టేషన్ మరియు మార్కెట్లలో ఈ టీంలు తిరుగుతూ పనిలో పెట్టుకున్నటువంటి హోటల్లు కానీ, దుకాణాలు బైక్ మెకానిక్ షాపులు గుర్తించి వారి పైన కార్మిక శాఖ తరపున చర్యలు తీసుకుంటామన్నారు.
సమీక్షా సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి షేక్ రసూల్ బి, డి ఎం అండ్ హెచ్ ఓ సుదర్శన్, ఏ హెచ్ టి యు ఇన్చార్జ్ గోపీనాథ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యోహాన్, బాల్ రక్షా భవన్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, డిసిపిఓ చైతన్యకుమార్, పోలీసు కార్మిక శాఖ డీసీపీయూ మరియు చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.