ఎస్సారెస్పీకి జలకళ సీఎం కేసిఆర్‌తోనే సాధ్యమైంది

బాల్కొండ, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామ్‌ సాగర్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌పి) ప్రాజెక్ట్‌ పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద జరిపిన శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ 60 వసంతాలు వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంతకు ముందు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ పై ఉన్న భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ విగ్రహానికి నివాళులు అర్పించారు.

అనంతరం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్‌ పంప్‌ హౌజ్‌ వద్ద వేడుకలో పాల్గొని మంత్రి ప్రసంగించారు. 1951 లో ఆనాటి హైదరాబాద్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదనలు పంపిస్తే 12 సంవత్సరాలు తర్వాత అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1963లో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 40 కోట్ల వ్యయంతో శంకుస్ధాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. ఎస్సారెస్పీ పూర్తి చేసి 1983 లో డ్యాంలో నీటిని నింపారని అన్నారు.

ప్రాజెక్ట్‌ మొదటి ఫేజ్‌ పూర్తి కావడానికి సుమారు 20 ఏళ్లు పట్టిందని అన్నారు. 2015-16 సంవత్సరంలో పది లక్షల ఎకరాల అయకట్టు కు నీల్లు అందిచేలా రెండో ఫేజ్‌ పనులు పూర్తి అయ్యాయనీ తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ కు ఎన్నో అంశాలు అడ్డుగా నిలిచాయని, 1956లో ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణను కలిపిన తర్వాత అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ వర ప్రదాయినిని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందనీ కేసిఆర్‌ ఎన్నో సార్లు ఆవేదన వ్యక్తం చేశారని, ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవ ఆలయాలు లాగా, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలుగా ఉన్నాయని 1996లో ఎస్సారెస్పీ కట్ట మీద ప్రాజెక్ట్‌ దుస్థితి చూసి కేసిఆర్‌ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.

ఎన్నో సార్లు ఎండిపోయిన శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ చూశానని అన్నారు. 2009-10 సంవత్సరంలో ఆర్మూర్‌ జెఏసి ఛైర్మన్‌ జర్నలిస్ట్‌ చారి అధ్వర్యంలో బాల్కొండ ప్రాంతంలో 100 కి. మీ పాదయాత్ర చేపట్టామని అప్పుడు ఎస్సారెస్పీ ప్రాజెక్టును కళ్ళారా చూశాననీ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు మంత్రి. గంగమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా దీవించు ఈ ప్రాంతం పచ్చ బడేలా దీవించు, నీవు తరలిరా తల్లి అని పూజలు చేశామని తెలిపారు. ఇక్కడ ఎంతో మంది హేమహేమి ఇరిగేషన్‌ ఇంజనీర్ల నడుమ ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఒక్కో ఇంజనీర్‌తో తన అనుబంధాన్ని మంత్రి ఈ సందర్బంగా పంచుకున్నారు.

ఎస్సారెస్పికి రివర్స్‌ పంప్‌ ద్వారా నీరు వస్తుందా అని సందేహలు వ్యక్తం చేశారు కానీ కేసిఆర్‌ దాన్ని సాధ్యం చేశారని అన్నారు. పునర్జీవ పధకం ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి తీసుకొచ్చామని, ఎస్సారెస్పి ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు చేశామన్నారు. ప్యాకేజీ 21, 22 ద్వారా ఉమ్మడి జిల్లాలోని గ్రామాలకు కాళేశ్వరం జలాలను త్వరలో అందిస్తామన్నారు. పునర్జీవ పధకం తో రైతులకు భరోసా వచ్చిందన్నారు. పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ ఎప్పుడూ నిండు కుండలా ఉంటుందని తద్వారా అలీ సాగర్‌, గుత్పలిఫ్ట్‌, నవాబ్‌ లిఫ్ట్‌, లక్ష్మి కెనాల్‌, చౌట్‌ పల్లి హన్మంత్‌ రెడ్డి లిఫ్ట్‌, బోదేపల్లి లిఫ్ట్‌ల ద్వారా నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ రైతాంగానికి సాగు నీరు అందించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో ఉద్యమ కారుడు, రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్‌ శాఖ సలహాదారు శ్రీధర్‌ రావుదేశ్‌ పాండే, ఈఎన్సి నాగేందర్‌, ఎస్సారెస్పీ సి.ఈ సుధాకర్‌ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సి.ఈ నల్లా వేంకటేశ్వర్లు, నిజామాబాద్‌ సి.ఈ మధుసూదన్‌, సి.ఈ శంకర్‌, ఎస్‌.ఈ శ్రీనివాస రెడ్డి, సీనియర్‌ ఇంజనీర్‌ విజయ ప్రకాష్‌ పలువురు ఇరిగేషన్‌ శాఖ ఈ.ఈ లు, ఏ.ఈ లు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »