నిజామాబాద్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా,బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దుతున్నారు.
గతంలో ఎన్నడూ ఇంతటి వర్షాలు చూడలేదని స్థానిక ప్రజలు మంత్రితో మాట్లాడారు. రెవెన్యూ,పోలీస్,ఎలక్ట్రిసిటీ,పంచాయితీ రాజ్,ఇరిగేషన్, ఆర్ అండ్ బి, హెల్త్ పలు ప్రభుత్వ శాఖలు అధికారులను, క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు, రైతులతో మాట్లాడుతూ మేమున్నాం అంటూ వారికి ధైర్యం చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్ళొద్దని కోరారు.
వేల్పూర్ మండల కేంద్రంలో అదేవిధంగా ఆర్మూర్ నుండి జగిత్యాల్‌కు వెళ్లే జాతీయ రహదారి వద్ద, పడగల్ గ్రామానికి వెళ్లే దారిలో చెరువులు తెగి వరదలు రోడ్లపై నుండి పారుతుండటంతో ప్రభావిత ప్రాంతాలను గురువారం వేకువ జామున్నే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను, ఇరిగేషన్ అధికారులందరు ఫీల్డ్‌లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులని ఆదేశించారు.