నిజామాబాద్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి లోనైన బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో 76 కుటుంబాలకు చెందిన 273 మంది సభ్యులు పునరావాస కేంద్రాల్లో వసతి పొందుతున్నారని వివరించారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన 60 మంది విద్యార్థినులను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. వేల్పూర్ లోని మదర్సకు చెందిన 12 మంది విద్యార్థులను స్థానిక షాదిఖానాలో పునరావాసం కల్పిస్తున్నామన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో 60 కుటుంబాలకు చెందిన 144 మంది సభ్యులను గూపన్పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించామని తెలిపారు. అలాగే బోధన్ మున్సిపల్ పట్టణంలో 20 మంది, నవీపేట మండల కేంద్రంలో 17 మంది, మెండోరా మండలం దూద్గాం లో 14మంది, రెంజల్ మండలం బాగేపల్లిలో ఆరుగురు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించబడ్డారని వివరించారు.
జిల్లాలో పరిస్థితి పూర్తిగా అడుపులోనే ఉందని, ప్రజలు భయాందోళనకు లోను కావద్దని కలెక్టర్ సూచించారు. అన్ని ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.