కామారెడ్డి, ఆగష్టు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సేవలు నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సి.పి.ఆర్. కార్యక్రమాలను జిల్లా, డివిజన్ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి మండలంలో జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ, యూత్ రెడ్ క్రాస్ సొసైటీ, నూతన సభ్యత్వాలను ముమ్మరంగా చేపట్టాలని అన్నారు.
ఇటీవల వర్షాలకు ప్రమాదకరంగా ఉన్న ఇండ్లకు తాటిపత్రులను అందజేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా రోడ్డు భద్రతపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సభ్యులుగా చేర్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. హరితహారంలో భాగంగా తులసి, నేలఉసిరి ,మునగ, బొప్పాయి, కరివే పాకు వంటి 5 రకాల ఔషధ మొక్కలు ఇంటింటికి పంపిణీచేసే విధంగా చూడాలన్నారు.
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజిమెంట్, ఎకో బ్రిక్స్ పై అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 16 నుంచి 14 రోజుల పాటు కుష్టువ్యాధి నిర్మూలనపై వైద్యారోగ్య శాఖా ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 3 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు అధిక సంఖ్యలో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జన ఔషధ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న డయాగ్నస్టిక్ హబ్ లో 57 రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.
జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ రాజన్న మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సంస్థ గత మూడు మాసాలలో జిల్లాలోని 22 మండలాలలో 48 క్యాంపులు నిర్వహించి వివిధ రకాల కార్యకలాపాలు చేపట్టామని, 380 యూనిట్ల రక్త నిధిని సేకరించామని తెలిపారు. సమావేశంలో సంస్థ వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవ రెడ్డి, కోశాధికారి దస్తి రామ్, కార్యవర్గ సభ్యులు వైద్యుడు విక్రమ్, నరసింహం, మానేటి కృష్ణ, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.