డిచ్‌పల్లి, ఆగష్టు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో 12769 గ్రామపంచాయతీలో 50వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వేతనాలు పెంచి క్రమబద్ధీకరించాలని జేఏసీ ఆధ్వర్యంలో 2023 జూలై 6 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య మొండి వైఖరి అవలంబిస్తుందని, తన మొండి వైఖరి విడనాడి వెంటనే జేఏసీతో చర్చలు జరిపాలని, పంచాయతి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ గత 24రోజులుగా సమ్మెతో గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత అస్తవ్యస్తంగా తయారైందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సపాయి కార్మికులే నిజమైన దేవుళ్ళు అని దండం పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పదకొండవ పీఆర్సీ, జీవో నెంబర్ 60 ప్రకారం నెలకు 15 వేల 600 సపాయిలకు, కారోబార్, బిల్ కలెక్టర్, ట్రాక్టర్ డ్రైవర్లకు, ఎలక్ట్రిషన్‌లకు 19 వేల 500 రూపాయలు వేతనం ఇవ్వాలనే వారి న్యాయమైన డిమాండ్ ను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
పని భద్రతను హరించే మల్టీపర్పస్ విధానాన్ని జీవో నెంబర్ 51ను సవరించాలని, కార్మికులందరికీ ప్రమాద భీమా 10 లక్షలు సాధారణ భీమా 5 లక్షలు పోస్ట్ ఆఫీస్‌లో కట్టాలని పిఎఫ్, ఈఎస్‌ఐ చట్టాలను వర్తింపజేయాలని న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు.
కరోనా కష్టసమయంలో ఈ కార్మికులు ముందు వరుసలో ఉండి పనిచేసిన విషయం ఎవరూ మర్చిపోలేనిదని, ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వ తేలిక భావాన్ని విడనాడి వెంటనే జేఏసీతో చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో దాసు ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జెపి గంగాధర్ ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి, శివ ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి, భారతి, సంసన్, అబయ్య, గంగాధర్ సాయిలు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.