కామారెడ్డి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో స్వప్న (28) మహిళకు అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో పాల్వంచ గ్రామానికి చెందిన యువకుడు అంకాలపు నవీన్ మానవతా దృక్పథంతో స్పందించి 18వ సారి పట్టణంలోని రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచాడు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానంతో పాటుగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్లేట్లెట్లను సకాలంలో అందజేస్తూ నేటి సమాజానికి, యువతకు ఎంతో ఆదర్శంగా అంకాలపు నవీన్ నిలవడం జరిగిందని, ఎవరైనా ఒకసారి రక్తం ఇవ్వాలంటేనే ఎంతగానో ఆలోచిస్తారని కామారెడ్డిలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా సరే అత్యవసరంగా బి నెగటివ్ రక్తం అవసరం ఉందంటే నేను ఉన్నాను అని భరోసాను కల్పిస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రక్తదాత అంకాలపు నవీన్‌కు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలియజేశారు.
కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్, టెక్నీషియన్లు జీవన్, సంతోష్, వెంకట్ పాల్గొన్నారు.