నిజామాబాద్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లలో గల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ శుక్రవారం మహారాష్ట్రకు తరలించారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ సూచనలతో మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాకు ఈవీఎంలను పంపించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్వయంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డిలు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

238 బ్యాలెట్ యూనిట్లు, 238 కంట్రోల్ యూనిట్లు, 71 వీ.వీ ప్యాట్ లను నాందేడ్ నుండి హాజరైన అధికారులకు అప్పగించారు. గత ఎన్నికలలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రస్తుతం నాందేడ్ కు తరలించగా, నిజామాబాద్ జిల్లాకు ఇటీవలే ఇతర ప్రాంతాల నుండి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీ.వీ ప్యాట్లు కేటాయించడం జరిగింది. వీటి పనితీరుకు సంబంధించి ప్రాథమిక పరిశీలన కూడా పూర్తయ్యిందని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, సంతోష్ తదితరులు ఉన్నారు.