హైదరాబాద్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు సాంకేతిక విప్లవానికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ రంగం అభివృద్ధిపై ఆయన వేసిన ప్రశ్న పై మాట్లాడారు. ఐటీకి హైదరాబాద్ రారాజు, ఐటీ ఐకాన్ మంత్రి కేటీఆర్ అని, ఈ ప్రభుత్వం ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితము చేయలేదు, అన్ని జిల్లాలకు విస్తరిస్తోందన్నారు.
2014కు ముందు హైదరాబాద్ అంటే లూటీ అని, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఐటి అని, కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయితే కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అన్నారు. సమర్ధ సేవలతో గొప్ప భవిష్యత్తు నేతనని నిరూపించారని, ఆర్మూర్ వంటి పట్టణాలకు కూడా ఐటీని విస్తరించాలన్నారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నిరోధానికి రీసెర్చ్ సెంటర్ నెలకొల్పాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.2,41,275 కోట్ల ఐటీ ఎగుమతులు జరగడం హర్షదాయకమన్నారు. గతేడాది రూ.1,83,569 కోట్ల ఎగుమతులు చేయగా ఈ సారి 31.44 శాతం వృద్ధితో అదనంగా రూ.57,706 కోట్ల ఎగుమతులు చేయడం మంత్రి కేటీఆర్ సమర్థతకు నిదర్శనమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 2,90,000 కొత్త ఐటీ ఉద్యోగాలు రాగా కేవలం తెలంగాణలోనే 1,26,894 ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు.
దేశంలో వస్తున్న ప్రతీ రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే వస్తోందని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ నగరానికి ఐటీ ప్రాజెక్టు ఇచ్చినందుకు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.