కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ శాఖలకు కేటాయించిన 860 వి.ఆర్.ఏ. లకు శుక్రవారం మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిలాల్లో 1303 మంది వి.ఆర్.ఏ.లకు 860 మందికి విద్యార్హతల ఆధారంగా 19 శాఖలలో ఛైన్మన్, హెల్పేర్, జూనియర్ అసిస్టెంట్, లష్కర్, ఆఫీస్ సబార్డినేట్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, రికార్డ్ అసిస్టెంట్, వాచ్ మెన్ లుగా నియామకపత్రాలు అందజేయనున్నామన్నారు.
మిగతా వారిని ఇతర జిల్లాలకు కేటాయించనున్నామని చెప్పారు. గురువారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం పట్టణంలోని లక్ష్మి దేవి గార్డెన్ లో ఏర్పాటు చేయుకార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నామన్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో 318 మంది, నీటిపారుదల శాఖలో 182, మిషన్ భగీరథ లో 138, మునిసిపాలిటీల్లో 76 మంది చొప్పున వి.ఆర్.ఏ. లను కేటాయించారని చెప్పారు.
తమ శాఖలకు వి.ఆర్.ఏ. లను కేటాయించబడిన అధికారులు లక్ష్మిదేవి గార్డెన్‌లో అందుబాటులో ఉండి వారి నుంచి సమ్మతి పత్రాలు తీసుకోవాలని సూచించారు. తమ శాఖలో ఉన్న ఖాళీల మేరకు వి.ఆర్.ఏ. లకు పోస్టింగ్ ఇచ్చుటకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. తమ శాఖలో ఖాళీలు ఉంటే వెంటనే కలెక్టరేట్ లో వివరాలు అందజేయాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.