నిజామాబాద్, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు కానుండగా, ఇతర ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
అట్టహాసంగా నిర్వహించుకునే పంద్రాగస్టు వేడుక నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వేదిక, ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్ల గురించి పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో చర్చించి కీలక సూచనలు చేశారు.
భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు సంబురాలు జరుపుకుంటున్న తరుణంలో నిర్వహిస్తున్న పంద్రాగస్టు వేడుక కావడంతో ఏర్పాట్ల విషయమై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డి, జెడ్పి సీఈఓ గోవింద్, నిజామాబాద్ ఆర్దీవో రాజేంద్రకుమార్, డీసీపీ గిరిరాజు, అదనపు డీసీపీ జయరాం, ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
కాగా, ఉదయం 11 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేయనుండగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఉదయం 9.45 గంటలకు, ఆఫీసర్స్ క్లబ్‌లో ఉదయం 9.30 గంటలకు జిల్లా పాలనాధికారి జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు.