కామారెడ్డి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర ఐ.టి. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పరిశ్రమల శాఖామాత్యులు తారక రామారావు అన్నారు. సోమవారం కామారెడ్డి, ఎల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో సుమారు రూ. 60 కోట్ల వ్యయం గల పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు.
ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సమాజంలో ఏ పేదవర్గాన్ని వదిలిపెట్టకుండా బాగుచేస్తామని అన్నారు. బిసి,ఎంబీసీ కుల వృత్తులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నామని, అర్హులైన ప్రతి వ్యక్తికీ ఆర్ధిక సాయం అందేవరకు నిరంతర ప్రక్రియగా ఈ పథకం కొనసాగుతుందని అన్నారు. 9 ఏండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగం వచ్చిందని అన్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 1,03,348 మంది రైతులకు రైతుబంధు, రైతు భీమా క్రింద 2,043 మందికి ఆర్ధిక సాయం అందించమన్నారు.
కల్యాణ లక్ష్మి,షాదిముబారక్ క్రింద 7,193 మందికి ఆర్థిక సాయం అందించామన్నారు. గృహలక్ష్మి పథకం క్రింద 3 వేలకు అదనంగా మరో 3 వేల మందికి ఆర్థిక సహాయానికి తన వంతు సహకారామందిస్తానని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని మునిసిపాలిటీల్లో రహాదారులు, బ్రిడ్జిల నిర్మాణాలు, పురపాలిక అభివృద్ధికి రూ. 20 కోట్ల 31 లక్షలు, గ్రామ పంచాయతీల అభివృద్ధికిరూ. 25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జి.ఓ. జారీ చేశామని మంత్రి వెల్లడిరచారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తున్నందని చెప్పారు.
దేశ చరిత్రలో బీడీ కార్మికులకు ఆసరా పింఛనులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. నాడు దుర్భిక్షం-నేడు పచ్చని పొలాలతో ఏడాదిలో 3 పంటలకు నీలందించాలని ప్రభుత్వం సంకల్పిస్తుంటే కాంగ్రెస్ రాబందులు 50 ఏళ్ల పాలనలో ఆ ఆలోచన రాకపోగా 3 గంటల విద్యుత్ సరిపోతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం మతం పేర మంట పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. కె .సి.ఆర్. లాంటి నాయకున్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, యెల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్, ఎంపీ బిబి పాటిల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభ, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి మునిసిపల్ చైర్మన్లు జాహ్నవి, సత్యనారాయణ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.