కామారెడ్డి, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధీ చలన చిత్రం తిలకించడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిలో జాతీయ భావం పెంపొందించేందుకె రాష్ట్ర ప్రభుతం ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నదని అన్నారు. గురువారం కామారెడ్డిలోని 4 సినిమా హాళ్లు, బాన్సువాడలో 2 థియేటర్లు, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డి పేటలోని ఒక్కో సినిమా హాళ్ళో చిత్రం ప్రదర్శించగా 26 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 5,072 మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా చిత్రాన్ని తిలకించి భావోద్వేగానికి లోనయ్యారన్నారు.
ఈ నెల 20 న ఆదివారం మినహా 24 వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు చిత్రాన్ని తిలకించేవిధంగా రవాణ శాఖతో సమన్వయము చేసుకుంటూ విద్యాశాఖ పాఠశాలల వారీగా షెడ్యూల్ రూపొందించి విద్యార్థులను సినిమా హాళ్లకు తీసుకెళ్లి తిరిగి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తున్నదని తెలిపారు. కామారెడ్డిలోని ప్రియా 70 ఏం ఏంలో శాంతినికేతన్, ఆర్చిడ్స్, శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులతో మండల్ విద్యాధికారి ఎల్లయ్య చిత్రం తిలకించారు.