జిల్లా అభివృద్ధిపై సమీక్ష…

కామారెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల గురించి సభలో పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు, ప్రశ్నలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా జిల్లా ప్రజా పరిషద్‌ చైర్‌ పర్సన్‌ ధఫెదార్‌ శోభ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని సమావేశమందిరంలో జెడ్పి చైర్‌ పర్సన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధులకు సమస్యలు తెలుసునని, సభలో వారు ఏకరువు పెట్టిన సమస్యల పరిష్కార దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, గ్రామా రెవిన్యూ సహాయకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్‌.టి.సి. ని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు అండగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె .సి.ఆర్‌. కు ధన్యవాదాలు తెలుపుతూ జెడ్పి వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌ ప్రవేశ పెట్టిన తీర్మానాలపై సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా వ్యవసాయం, పశు సంవర్ధకం, విద్య, వైద్య, నీటిపారుదల, విద్యుత్తు, రోడ్లు, భవనాలు, పంచాయత్‌ రాజ్‌, డి.ఆర్‌.డి.ఓ. శాఖల ప్రగతిని సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, యం.పి .బిబి పాటిల్‌, శాసనసభ్యులు హనుమంత్‌ షిండే, జాజాల సురేందర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి, జెడ్పి సీఈఓ సాయగౌడ్‌ పాల్గొన్నారు.

ముందుగా వ్యవసాయ శాఖ ప్రగతిని సమీక్షిస్తూ జిల్లాలో 34,347 మంది రైతులకు75 కోట్ల 17 లక్షల పంట రుణాలు మాఫీ చేశామని, 2 లక్షల 96 వేల మంది రైతులకు రైతు బంధు, 1,238 మంది నామినీలకు రైతుభీమా అందించి ఆదుకున్నామన్నారు. కాగా సహకార సంఘాలలో రుణమాఫీ వన్‌ టైం సెట్టిల్మెంట్‌ చేయడంలేదని, యాసంగిలో వడగండ్ల వానవల్ల పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం అందించేలా చూడాలని పలువురు సభ్యులు కోరగా తగు చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ లీడ్‌ బ్యాంకు అధికారికి, వ్యవసాయాధికారి సూచించారు.

జిల్లాలో కౌలాసనాల, నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ల క్రింద ఆయకట్టుకు రబీకి అవసరమైన సాగు జలాలు అందిస్తామన్నారు. గొర్రెల అభివృద్ధి పధకం క్రింద గొల్ల కురుమలకు ఇచ్చిన గొర్రెలను కుక్కలా దాడి వల్ల చనిపోయిన లబ్దిదారులకు తగు ఆర్ధిక సహాయం అందించేలా చూడాలని జెడ్పి వైస్‌ చైర్మన్‌ కోరగా పరిశీలిస్తామని కలెక్టర్‌ తెలిపారు. విద్యుత్‌ శాఖను సమీక్షిస్తూ తిరుమలాపూర్‌, రామేశ్వర్‌ పల్లి, మహామామాద్‌ నగర్‌, కాటేపల్లి , వజ్రకండి, పెద్ద ఎక్లారా , పెద్ద గౌరారంలో నూతనంగా సబ్‌ స్టేషన్‌లు మంజూరయ్యాయని తెలుపగా వెంటనే టెండరు ప్రక్రియ పూర్తిచేసి పనులు మొదలుపెట్టవలసినదిగా శాసనసభ్యులు హనుమంత్‌ షిండే విద్యుత్తు అధికారిని ఆదేశించారు.

3 ఫేస్‌ కరెంటు సక్రమంగా రావడం లేదని, ఇనుప స్థంబాల వల్ల పశువులు చనిపోతున్నాయని సభ్యులు ప్రశ్నించగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్ల కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం పనిచేస్తున్న స్టాఫ్‌ను సర్దుబాటు చేయాలని, ప్రైవేట్‌ ఆసుపత్రులపై నిఘా ఉంచి పర్యవేక్షిస్తుండాలని సభ్యులు కోరారు. పాఠశాలలు, వసతి గృహ విద్యార్థులకు కండ్ల కలక వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ వైద్యాధికారి సూచించారు. విద్యాశాఖను సమీక్షిస్తూ భవానిపేట, శేట్‌పల్లి, రాంపూర్‌, రాజంపేట వంటి పలు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఉపాధ్యాయులను నియమించాలని సభ్యులు కోరారు.

రోడ్లు భవనాలు, పంచాయత్‌ రాజ్‌ శాఖలో వివిధ పధకాల క్రింద చేపట్టిన రహాదారులు, బ్రిడ్జిలు, భవన నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని శాసనసభ్యు డు సురేందర్‌ అన్నారు. ఉపాధి హామీ పధకం క్రింద 2,019 పనులను గుర్తించి 1,20,395 మంది కూలీలకు వంద రోజుల పని దినాలు కల్పించి 31 కోట్ల 93 లక్షల వేతనం చెల్లించామన్నారు. గిరి వికాస్‌ క్రింద 404 ఎస్‌.టి. లబ్దిదారులకు 10 కోట్ల 11 లక్షల ఆర్ధిక సహాయం అందించామని, సామాజిక తనిఖీ క్రింద 2 కోట్ల 84 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించి ఇప్పటి వరకు కోటి 74 లక్షలు రికవరీ చేశామన్నారు.

ఈ నెల నుండి కొత్తగా 173 మంది బీడీ, చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు అందించనున్నామని తెలిపారు. ప్రభుత్వం వితంతువు పింఛనులో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే మంజారు చేస్తున్నదని, జిల్లాల్లో ఒక్క వితంతు పింఛను దరఖాస్తు కూడా పెండిరగు లేదని కలెక్టర్‌ చెప్పారు. కాగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధికి తదితర వాటికీ రేషన్‌ కార్డు ప్రామాణికంగా చూస్తున్నారని, నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా రేషన్‌ కార్డు వచ్చేలా చూడాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఎంపిపిలు, జెడ్పిటిసిలు, కో అప్షన్‌ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »