ఆర్మూర్, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్, స్థానిక కౌన్సిలర్ విజయలక్ష్మి లింబాద్రిగౌడ్ హాజరై మాట్లాడారు.
పాపన్న గౌడ్ అంతర్జాతీయ ఖ్యాతిగాంచారని, సర్దార్ చరిత్రను ఆంగ్లేయ కవి జే.యే.బోయేల్ ఇండియన్ అంటిక్వెరి పత్రికలో 1874లోనే రాశారని గుర్తుచేశారు. పాపన్న వీరత్వానికి గుర్తుగా లండన్ మ్యూజియంలో విగ్రహాన్ని పొందుపరిచారని, చరిత్రను పరిశోధించి తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ దివంగత ఆచార్య పేర్వారం జగన్నాథం, పీహెచ్డీ తీసుకుని పాపన్న తెలంగాణ ప్రాంతంలోని ఖిలాషాపురానికి చెందినవాడని రుజువు చేశారన్నారు.
సంఘ కార్యదర్శి సురేందర్ గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న బాల్యం నుండే బడుగు, బలహీన వర్గాల కు అండగా నిలిచాడని, ఆనాటి రజాకారులకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు. 1650 సంవత్సరంలో ధర్మన్న గౌడ్, సర్వమ్మ దంపతులకు గౌడ కులంలో జన్మించిన పాపన్న ఆనాడు సమాజంలో బడుగులపై జరుగుతున్న అణచివేత ధోరణికి వ్యతిరేకంగా నిలిచిన వీరుడు అని అన్నారు.
జాకీర్దారులకు, జమీందారులను వ్యతిరేకంగా గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి వారి ఆస్తులను కొల్లగొట్టి సామాన్యులకు పంచిన మహనీయుడని అన్నారు. కేవలం పది మందితో ప్రారంభించిన తన సైన్యాన్ని 3000 లకు పైగా సైనిక రాజ్యాన్ని తయారుచేసుకొని ఆనాటి తురుష్కుల పాలనను గడగడలాడిరచాడని అన్నారు. సుమారు 20 కోటలను వశపరచుకొని తన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆనాటి మహా మేధావని పేర్కొన్నారు. దైవభక్తి మెండుగా గల పాపన్న హుజురాబాద్లో ఎల్లమ్మ మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడని చెప్పారు.
300 సంవత్సరాలకు పూర్వమే విప్లవమంటే ఏమిటో ప్రజలకు తెలియచెప్పిన మహా యోధుడు, పురుషుడని సర్వన్నను అభివర్ణించారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పాపన్నను ఆనాటి సామంతులు పగబట్టి నాటి నవాబులకు బాసటగా నిలిచి పాపన్నపై యుద్ధాన్ని పురిగోల్పారని వివరించారు. 1707నుండి సర్వాన్నపై పలుమార్లు యుద్ధాలు ప్రకటించినప్పటికీ చివరికి 1710 సంవత్సరంలో పాపన్న మట్టుపెట్టారని తెలిపారు.
కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు భూమా గౌడ్, బోజా గౌడ్, మంతెన లింబా గౌడ్, కుంట గోవర్ధన్ గౌడ్, సించు నారా గౌడ్, బత్తిని నారా గౌడ్, కంచర్ల లింగాగౌడ్, చందర్, సురేందర్ గౌడ్, పూదరి శ్రీకాంత్ గౌడ్, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ధర్పల్లి ముఖేష్ గౌడ్, ఎలుక రాజేందర్ గౌడ్, బండి శంకర్ గౌడ్, గౌడ కులస్తులు సాయినాథ్ గౌడ్, రాజేందర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఆత్మ చరణ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.