ఆర్మూర్, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎర్రజొన్నల సీడ్ వ్యాపారి కునింటీ మహిపాల్ రెడ్డి అయన నివాసంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుపుతూ అయన సన్నిహితులు మెజారిటీ కార్యకర్తలు ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అయన తెలిపారు.
పార్టీ ఆదేశానుసరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని అయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతు ధర కల్పించడానికి గాను వరికి రూ. 25, ఎర్రజొన్నలకు రూ. 35 చెల్లిస్తానని వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎర్రజొన్నలకు రూ.35 చెల్లిస్తే, తాను మరో 5 రూపాయలు కలిపి కిలోకు రూ.40 చెల్లిస్తానన్నారు.
రైతులకు అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ. 4వేలు పింఛన్ ఇస్తుందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గ్రామ గ్రామాన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటానన్నారు.