కామారెడ్డి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యం నుంచే విద్యార్థులలో జాతీయ భావం పెంపొందించేందుకు జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని అన్నారు.
శనివారం కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డిపేటలోని (9) సినిమా హాళ్లలో చిత్ర ప్రదర్శన గావించగా 30 పాఠశాలకు చెందిన 4,571 మంది విద్యార్థులు ఆయా ఉపాద్యాయులతో కలిసి ఎంతో ఆసక్తిగా చిత్రాన్ని తిలకించారని కలెక్టర్ తెలిపారు. 20న ఆదివారం సెలవు దినం సందర్భంగా చిత్ర ప్రదర్శన ఉండదని అన్నారు.
తిరిగి 21 నుండి 24 వరకు పై థియేటర్లలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1. 30 వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని ఆయన తెలిపారు. ఇట్టి చిత్రాన్ని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పౌరులు కూడా తిలకించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.