మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు

కామారెడ్డి, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తోందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం కింద మైనార్టీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో చిన్న, చిన్న వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా బలోపేతమై ఇతరులకు మైనార్టీ సోదరులు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఇటీవల 300 మంది బీసీ, కుల వృత్తుల వారికి జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వం రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు పేద మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య ను అభ్యసించడం కోసం ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఉచితంగా ఇస్తుందని చెప్పారు. కుల,మత బేదం లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల పేదలకు ఆర్థిక సాయం అందజేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు.

త్వరలో మైనార్టీ మహిళలకు 300 కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. రంజాన్‌, క్రిస్టమస్‌ పండగలకు ప్రభుత్వం నిరుపేదలకు దుస్తులను కానుకలుగా ఇస్తుందని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని సూచించారు. రెగ్యులర్‌ అయిన పంచాయతీ కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపారు.కామారెడ్డి నియోజకవర్గంలోని 70 మంది పంచాయతీ కార్యదర్శులను శాశ్వత ప్రతిపాదికన నియమిస్తున్నట్లు నియామక పత్రాలు అందజేశారు. 75 మంది మైనార్టీ సోదరులకు రూ. లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. వచ్చిన ఆర్థిక సాయం మైనార్టీ సోదరులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. వచ్చిన డబ్బులను దుబారా చేయవద్దని చెప్పారు. 2018 పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ చట్టం ద్వారా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు పచ్చదనం పెంచడానికి ప్రభుత్వం 10% గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయించిందని చెప్పారు. 8 ఏళ్లలో మొక్కలు వృక్షాలుగా మారడం వల్ల పచ్చదనం 7 శాతం పెరిగిందని పేర్కొన్నారు.

సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్దిన్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడి, జిల్లా ఇంచార్జ్‌ మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వరరావు, కామారెడ్డి ఎంపీపీ ఆంజనేయులు, మాచారెడ్డి జెడ్పిటిసి సభ్యుడు రామ్‌ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »