కామారెడ్డి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధంలాంటిదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం నిజాంసాగర్ చౌరస్తా నుండి కళాభారతి వరకు ‘ఐ ఓట్ ఫార్ ష్యూర్ అంశమై నిర్వహించిన 5 కె -రన్‌ను జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కు వినియోగించుకోవడం తదితర అంశాలపై అవగాహనా కల్పించే నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలలో 5 కె రన్ నిర్వహించామన్నారు.
వర్షం పడుతున్నా యువత ఎంతో ఉత్సాహంతో పరుగులో పాల్గొనడం సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. ఈవియంల ద్వారా ఎలా ఓటు వేయాలో తెలియజేస్తూ సంచార వాహనాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఓటు హక్కు మన జన్మ హక్కు అని, ఓటు ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
ఈ నెల 26, 27 న తిరిగి సెప్టెంబర్ 2,3 తేదీలలో పోలింగ్ బూతు స్థాయిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరు బూతు స్థాయి అధికారుల వద్ద ఉన్న ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరును సరిచూసుకుని మార్పులు, చేర్పులు ఉంటె సరిచేసుకోవాలని సూచించారు. 5 కె రన్‌లో మున్సిపల్ కమీషన్ దేవేందర్, డిఎల్ పిఓ సాయిబాబ, తహశీల్ధార్ సాయిలు, ఉద్యోగులు, యువత పాల్గొన్నారు.