కామారెడ్డి, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసముంటున్న తండ్రి లేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముత్యాల ప్రమీల కీర్తిశేషులు భూదయ్య కుమార్తె శిరీష వివాహానికి కావలసిన పుస్తె మట్టలను ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆర్థిక సహాయంతో ఆదివారం అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి 8 వేల మంది పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు కావాల్సిన తాళిబొట్లను అందజేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శంగా నిలిచిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా సేవలు అభినందనీయమని, చాలామంది దగ్గర డబ్బు ఉంటుందని ఆ డబ్బును పేదవారికి, ఆపదలో ఉన్న వారికి అందించే మంచి మనసు కొందరికి మాత్రమే ఉంటుందని అలాంటి వ్యక్తులలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఒకరన్నారు.
కులం, మతం, ప్రాంతం, జాతి అనే భేదభావం లేకుండా ఏ కులంలో పేదవారు ఉన్నా వారి పెళ్లికి ఒక అన్నయ్య లాగా అండగా ఉండి పుస్తె మట్టెలు ఇవ్వడం, ఆర్థిక సహాయాలను అందించడం అతి సాధారణ విషయం కాదని వారు చేస్తున్న సేవలు తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారన్నారు. వధువు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు పుట్ల అనీల్, సలహాదారులు రమణ, ఎడ్ల రాజు, సుంకరి శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు.