నిజామాబాద్, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన మధ్యం పాలసీ 2023-2025 సంవత్సరాల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది.
నూతన ఎక్సయిజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 3759 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యధికంగా 25వ నెంబర్ మానిక్ బండార్ మద్యం దుకాణానికి ఏకంగా 112 దరఖాస్తులు రాగా, 26వ నెంబర్ మోపాల్ మద్యం షాప్ లైసెన్స్ కోసం 102 దరఖాస్తులు రావడం విశేషం.
ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని వేదిక పైకి ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్‌లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియను ఆద్యంతం ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు.
పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా రాజీవ్ గాంధీ ఆడిటోరియంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా ఆడిటోరియం వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు.
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ, సహాయ కమిషనర్ కిషన్, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది.