కామారెడ్డి, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మ్యానువల్ స్కావెంజర్ ఫ్రీ జిల్లాగా కామారెడ్డి జిల్లాను ప్రకటించినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మ్యానువల్ స్కావెంజర్ నిషేధ చట్టం పైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
పట్టణాల్లో, గ్రామాల్లో గృహాల నిర్మాణం కోసం అనుమతులు తీసుకునే వ్యక్తులకు గృహాలలో మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా అనుమతి పత్రాలు ఉంటేనే అనుమతి ఇవ్వాలని తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ లేకుండా ఎవరైనా వ్యక్తులు మరుగుదొడ్లు నిర్మించుకుంటే అధికారులు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ కార్మికులు మరుగుదొడ్డిలోకి దిగి మానవ విసర్జితాలు చేతులతో తొలగించవద్దని చెప్పారు.
స్కావేంజర్ నిషేధిత చట్టంపై మున్సిపాలిటీ స్థాయిలో కార్మికులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత, డిపిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు రమేష్ కుమార్, జగ్జీవన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.