కామారెడ్డి, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ జాబితా పకడ్బందీగా రూపొందించడంలో బూతు లేవల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో 791 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక దృష్టిని సారించాలని కోరారు. ఈనెల 26, 27వ తేదీల్లో, సెప్టెంబర్ రెండు మూడు తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో విఐపి ల పేర్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలన్నారు. జిల్లాలో అర్హత గల ఏ ఒక్క ఓటరు ఓటర్ జాబితాలో నమోదు కాకుండా ఉండరాదని చెప్పారు.
ఏమైనా డిలీట్ చేసేవి ఉంటే ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత చేయాలన్నారు. డిలీట్ చేసేముందు నోటీస్ తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. నకిలీ ఓటర్లు జాబితాలో లేకుండా చూడాలన్నారు. ఒక వ్యక్తి పేరు జాబితాలో రెండుసార్లు లేకుండా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే విధంగా చూడాలన్నారు. ఈవీఎం నిర్వహణపై గ్రామాల్లో ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొన్నారు.
సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అనిల్ కుమార్, తాసిల్దార్లు ప్రేమ్ కుమార్, సాయిలు, ఇందిరా ప్రియదర్శిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, అనిల్ కుమార్, నరేందర్, బాలరాజు పాల్గొన్నారు.