డిచ్‌పల్లి, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం కాబడిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కి తమ పదోన్నతుల విషయమై వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం స్వీకరించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు అర్హత కలిగిన పదోన్నతులు, ఉద్యోగ క్రమబద్ధీకరణకు సానుకూలంగా ఉందని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014 రిక్రూట్మెంట్ ద్వారా నియామకం పొంది దశాబ్ద కాలమైనప్పటికీ పదోన్నతులు కల్పించకపోవడం శోచనీయమని వారికి పదోన్నతి ప్రక్రియను తక్షణమే వేగవంతం చేయాలని పేర్కొన్నారు. 2014 రిక్రూట్మెంట్ ద్వారా నియామకమైన అధ్యాపకులకు కోర్టు ఆదేశాల మేరకు పదోన్నతి ప్రక్రియను కొనసాగించాలని వైస్ ఛాన్స్‌లర్ వాకాటి కరుణకి సమాచారాన్ని చేరవేశారు.
విశ్వవిద్యాలయ అభివృద్ధి కొరకు అధ్యాపకులు అంకితభావంతో పనిచేసి న్యాకు గ్రేడ్ కోసం కృషిచేసి విశ్వవిద్యాలయ కీర్తిని మరింత పెంచాలన్నారు. విశ్వవిద్యాలయంలో సాంకేతికంగా జరిగే ఈ అసౌకర్యం వలన నేటికీ ముగ్గురు అర్హతలు ఉండి పదోన్నతులు పొందకుండానే పదవి విరమణ పొందడం పట్ల విచారణ వ్యక్తం చేశారు. కోర్టు పదోన్నతులను కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిబంధనల పేరుతో విశ్వవిద్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు వాయిదా వేయడాన్ని బాజిరెడ్డి తీవ్రంగా పరిగణించి న్యాయబద్ధంగా జరగాల్సిన పదోన్నతులను తక్షణమే పూర్తి చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో 2014 లో నియామకం కాబడిన అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాజిరెడ్డి గోవర్ధన్‌ని శాలువా, పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు.