నిజామాబాద్, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలు, డిచ్పల్లి లోని సి.ఎం.సి కళాశాలలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలు ఏవీ అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాల గురించి తనవెంట ఉన్న అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, డీసీపీ జయరాం తదితరులతో ప్రాథమికంగా చర్చించారు. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా అన్ని వసతులతో కూడిన భవన సముదాయాన్ని గుర్తించి ఎన్నికల సంఘానికి వివరాలు పంపించాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న మరికొన్ని కళాశాలలు, ఇతర కార్యాలయాల భవనాలను పరిశీలించి తనకు పూర్తి వివరాలు తెలియజేయాలని నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ను ఆదేశించారు.
ఖిల్లా ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. ఒకే ప్రాంగణంలో మూడు పాఠశాలలు కొనసాగుతుండడంతో తరగతి గదుల కొరత నెలకొని ఉండడాన్ని గమనించిన కలెక్టర్, అడిషనల్ క్లాస్ రూమ్ ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే మన ఊరు – మన బడి కింద మంజూరైన పనులకు సంబంధించి ప్రస్తుతం అవి ఏ దశలో కొనసాగుతున్నాయన్నది పరిశీలించారు.
నీటి కొరత ఉందని ఉపాధ్యాయులు తెలుపగా, బోరు బావిని మరమ్మతులు చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తిస్తూ, అదనపు గదుల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, మున్సిపల్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు ఉన్నారు.