నిజామాబాద్, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని 17,173 మంది విద్యార్థినీ, విద్యార్థులు వీక్షించారని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనలు, మార్గనిర్దేశకంలో జిల్లాలో ఈ నెల 17 నుండి 24 వ తేదీ వరకు జిల్లాలోని 9 సినిమా ధియేటర్లు నిజామాబాద్‌లోని విజయ్ థియేటర్, ఉషా ప్రసాద్ స్క్రీన్-3, లాలితామహల్, నటరాజ్, దేవి థియేటర్, నందిపేటలోని కృష్ణ థియేటర్, దర్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్, ఆర్మూర్‌లోని పీవీఆర్ థియేటర్, భీంగల్ లోని సుదర్శన్ థియేటర్‌లలో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు గాంధీ చలన చిత్రాన్ని జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్ధినీ విద్యారులు తిలకించారని తెలిపారు.
సినిమా ప్రదర్శనలకు సంబంధించి ధియేటర్లలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని, బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి విద్యార్థులను స్కూళ్ల నుండి ధియేటర్లకు, తిరిగి స్కూళ్లకు చేర్చడం జరిగిందని, సినిమా ప్రదర్శనలు అన్ని ధియేటర్లలో ప్రశాంతంగా జరిగాయని, ధియేటర్ల యాజమాన్యాలు, పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు గాంధీ చలన చిత్ర ప్రదర్శనలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పాటునందించారని తెలిపారు.