కామారెడ్డి, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. భూగర్భ జలాల త్రవ్వకాలు, నియంత్రణకు 2002 లో ఏర్పాటు చేసిన చట్టాన్ని మరింత బలోపేతం చేసి సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జి.ఓ. 15 విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు.
ఇట్టి వాల్టా చట్టం, జి.ఓ. ను మరింత పటిష్టవంతంగా అమలు చేయుటకు శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో మంచినీళ్ల యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని, కాబట్టి భూమ్మీద పడే ప్రతి వర్షపు చినుకును ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయడంతో పాటు నీటిని పొదుపుగా వాడుకోవాలని శాస్త్రవేత్తలు ఉటంకిస్తున్నారని అన్నారు.
ఈ వాల్టా చట్టం ప్రకారం నీటి వినియోగం, నియంత్రణకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు సూచించిందని అన్నారు. దీని ప్రకారం పరిశ్రమలు, షాపింగ్ కాంప్లెక్స్, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్స్, హౌసింగ్ సొసైటీ, మంచినీటి ప్లాంట్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫంక్షన్ హాల్ తదితర వాటిలో బోర్లు వేయుటకు తప్పనిసరిగా భూగర్భ జల శాఖ నుండి నిరభ్యంతర పత్రం (యెన్.ఓ.సి.) ముందస్తుగా తీసుకోవలసి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్ ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని అన్నారు.
దీనిపై మునిసిపల్, పరిశ్రమలు, గనులు, పౌర సరఫరాలు తదితర శాఖల అధికారులు సంబంధిత సంస్థలకు అవగాహన కలిగించి, లైసెన్స్, బోరుబావుల నిర్మాణానికి అనుమతులు పొందేలా చూడాలని, వారి నుండి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని సూచించారు. కాగా వ్యక్తిగత అవసరాలు, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ కార్యకలాపాలు, సాయుధ దళాల కోసం బోరు బావులు వేసుకొనుటకు ప్రభుత్వం మినహాయింపు నిచ్చిందని అన్నారు. మిగిలిన వారు వినియోగించే నీటిని బట్టి కనీస చార్జీలు చెల్లించవలసి ఉంటుందని అన్నారు. వాల్టా చట్టం నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా విజిలెన్స్ కమిటీ గట్టిగా కృషిచేయాలన్నారు.
సమావేశంలో భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు సతీష్ యాదవ్, జిల్లా పరిశ్రమల అధికారి లాలు నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, డిపిఓ శ్రీనివాస్ రావు, ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ తిరుపతి, విద్యుత్ శాఖ ఏ.డి. మల్లేష్, డీఆర్‌డిఎ ఫీల్డ్ మేనేజర్ రామ్ నారాయణ, మునిసిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.