కామారెడ్డి, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ బీబీపాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో మాట్లాడారు.
పంచాయత్ రాజ్, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వివిధ రహాదారులు, బ్రిడ్జిల నిర్మాణ పనులను నాణ్యత తో త్వరితగతిన పూర్తిచేయాలని, పనులు మొదలు పెట్టని వాటికి టెండర్లు ఆహ్వానించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పంట పొలాలకు వెళ్ళడానికి వీలుగా రహాదారులు నిర్మించాలన్నారు. జిల్లాకు ఇచ్చిన (3) అంబులెన్స్ లు వాడుకలో ఉపయోగించే విధంగా చూడాలన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సరైన సమాచారం ఇచ్చే విధంగా అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని సూచించారు. ముందుగా విద్యా శాఖను సమీక్షిస్తూ మధ్యాహ్న భోజన పథకం కింద రూ. 2కోట్ల 84 లక్షలు, కస్తూరి భా బాలికల విద్యాలయాలకు రూ. 3 కోట్ల 58 లక్షలు ఖర్చు చేశామన్నారు. మన ఊరు మనబడి క్రింద 351 పాఠశాలల మౌలిక వసతుల కల్పన చేపట్టి ఇంతవరకు 27 పాఠశాలలు ప్రారంభించుకున్నామని తెలిపారు. మిగతా పనులు వివిధ దశలలో ఉన్నాయని అన్నారు.
నాగిరెడ్డిపేట మండలంలోని గిరిజన విద్యార్థులకు మధ్యాన్నం భోజనం అందడంలేదని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా అందేవిధంగా చూస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకం క్రింద 2700 పనులు గుర్తించి 1 లక్ష 21 వేల మంది కూలీలకు 19 లక్షల 42 వేల పని దినాలు కల్పించి రూ.33 కోట్ల 49 లక్షల వేతనాలు చెల్లించామన్నారు. గిరి వికాస్ క్రింద 404 ఎస్.టి. లబ్దిదారులకు రూ.12 కోట్ల 12 లక్షల ఆర్ధిక సహాయం అందించనున్నామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో 1,69,231 మందికి ప్రతి నెల 35 కోట్ల 99 లక్షల ఆసరా పింఛన్లు అందిస్తున్నామని,కొత్తగా 173 బీడీ టేకేదారులకు పింఛన్లు మంజూరు చేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న వితంతువులకు ఎలాంటి జాప్యం లేకుండ పింఛన్లు మంజూరు చేస్తున్నామన్నారు. మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను సమీక్షిస్తూ జిల్లాలోని 1,038 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భవతులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. శాఖలో పదోన్నతుల ప్రక్రియ నడుస్తున్నదని, అయిన వెంటనే అంగన్వాడీ టీచర్ల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.
వికలాంగులకు ఉపకరణాలు ఇస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు తెలుపడం లేదని సభ్యులు ప్రశ్నించగా సెప్టెంబర్ 2వ వారంలో అందించే ఉపకరణాల పంపిణీకి ఆహ్వానిస్తామన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని, పెండిరగు బిల్లులపై నివేదిక అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు కొత్తగా 7 విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరయ్యాయని పనులు సాగుతున్నాయన్నారు. గ్రామ జ్యోతి యోజన క్రింద 11,600 లబ్దిదారులకు కనీస చార్జితో విద్యుత్ మీటర్లు బిగించామన్నారు. ఏం.పి. లోక్‌సభ నిధుల క్రింద జిల్లాలో రూ.13 కోట్ల 62 లక్షలతో 612 పనులు చేపట్టామని, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
మెదక్-ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి-రుద్రూర్ వరకు 68 కిలో మీటర్ల 765-డి రెండు వరసల రహదారి నిర్మాణానికి రూ. 900 కోట్లు మంజూరు కాగా పనులు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్, డిఆర్ డిఓ సాయన్న, జిల్లా అధికారులు, ఎంపిపిలు తదితరులు పాల్గొన్నారు.