వేల్పూర్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో భాగంగా నేడు చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి రైతు వేదిక వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరితహారం అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో తెలంగాణలో అటవీ శాతం, గ్రీనరి శాతం ఘనంగా పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు.
పచ్చదనం పెంపులో నేడు తెలంగాణ నెంబర్ వన్ అయ్యింది అన్నారు. సమాజ హితం కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం హరితహారమని… ఓట్ల కోసమో, సీట్ల కోసమో కానేకాదని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు మనం అందించే సంపద పచ్చదనమే అని అన్నారు. కేసిఆర్ ప్రకృతి ప్రేమికుడని అందుకే రాజకీయాలకు సంబంధం లేకుండా హరితహరం చేపట్టి గ్రీనరి పెంపుకు శ్రీకారం చుట్టారని వివరించారు.