కామారెడ్డిలో హరితహారం భేష్‌… పలు సూచనలు…

కామరెడ్డి, ఆగష్టు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిక్కటి గ్రీనరీ తో జిల్లా పచ్చదనం సంతరించుకునేలా విరివిగా మొక్కల పెంపకం చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం హరితహారం ఓ.ఎస్‌.డి. ప్రియాంక వర్గీస్‌ అధికారులకు సూచించారు. వాతావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని, ఆ దిశగా జిల్లా అంతా పచ్చదనం సంతరించుకునేలా ఎక్కడా గ్యాప్‌ లేకుండా మొక్కలు నాటాలని అన్నారు.

సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరిలతో కలిసి హరితాహారం కార్యక్రమాన్ని సమీక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 9 విడతలుగా చేపట్టిన హరితహారాం కార్యక్రమం సత్పలితాలనిస్తున్నదని, 7.7 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని, వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయని అన్నారు. ఈ సంధర్భంగా జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలు, 3 మునిసిపాలిటీలలోని 539 నర్సరీలలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించి మొక్కల లభ్యత వివరాలు అందజేయవలసినదిగా అటవీ శాఖాధికారులను ఆదేశించారు.

జిల్లాలోని జాతీయ ప్రాధికార సంస్థ, రోడ్లు,భవనాలు, పంచాయతీ రాజ్‌ శాఖ ఆదీనంలో ఎన్ని కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయి, ఎన్ని కిలో మీటర్ల మేర మొక్కలు నాటారు, ఇంకెన్ని కిలో మీటర్లు నాటాలో కార్యాచరణ రూపొందించి రోడ్ల కిరుపువైపులా పలు వరుసలలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. మునిసిపాలిటీలలోని మీడియన్‌ లో పెద్ద మొక్కలతో పాటు పూల మొక్కలు ఒక క్రమపద్ధతిలో అందంగా కనిపించేవిధంగా నాటాలని సూచించారు.

వచ్చే సెప్టెంబర్‌ 30 నాటికీ జిల్లాలో ఎక్కడా గ్యాప్‌ లేకుండా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని, ప్రధానంగా ఒక గ్రామ పంచాయతీ నుండి మరో గ్రామ పంచాయతీ మధ్య ఖాళీ స్థలం లేకుండా మొక్కలు నాటాలని, అదేవిధంగా అంతర్గత రహదారులు, దుకాణాలు, ఇండ్ల సముదాయంలో పూలమొక్కలు, ఔషధ మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటాలని తిరిగి తాను మళ్ళి వచ్చి ర్యాండమ్‌గా పరిశీలిస్తానని అన్నారు. టార్గెట్‌ ఇచ్చాము- చేశామని కాక అధికారులు మనసు పెట్టి మనస్ఫూర్తిగా పనిచేయాలని హితవు చెప్పారు.

మునిసిపాలిటీలు బడ్జెట్‌ లో 10 శాతం గ్రీనరికి ఖర్చు పెట్టాలని, కామారెడ్డి పట్టణంలో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించి ఉల్లాసంగా సేదతీరుటకు గాను బ్లాక్‌ ఫారెస్ట్‌ లో అర్బన్‌ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపవలసినదిగా అదికారులకు సూచించారు. జిల్లా పొలిసు కార్యాలయ సముదాయంలో చక్కటి నర్సరీ ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచించారు. జిల్లాలోని 23 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పచ్చదనం పెంపుకు కృషిచేస్తున్నామని ఎస్పీ తెలుపగా ఆమె ఎస్పీని అభినందించారు.

కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లడుతూ జిల్లాలో 258 ఎకరాలలో 678 పల్లె ప్రకృతి వనాలు, 659 ఎకరాలలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, గ్రామా పంచాయతీలు, మునిసిపాలిటీలలో 539 నర్సరీలు ఏర్పాటు చేసి 38 లక్షల మొక్కలు పెంచుతున్నామని తెలిపారు. అంతకుముందు ఓ.ఎస్‌.డి. ప్రియాంక వర్గీస్‌ ను కలెక్టర్‌ కామారెడ్డి స్వాగత తోరణం వద్ద పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం. మీడియాన్‌లో నాటిన మొక్కలను, 8 వ వార్డు లో పల్లె ప్రకృతి వనాన్ని, రాశివనం, భవాని నర్సరీలను సందర్శించి వాటి నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లాలోని వైరా మునిసిపాలిటీలో ఉన్న నర్సరీ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తున్నదని, అటవీ, మునిసిపల్‌ అధికారులు ఒకమారు ఆ నర్సరీని సందర్శించి అంతకన్న బాగా కామారెడ్డి లో నర్సరీ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. రాశివనంలో 2015 రాష్ట్ర ముఖ్యమంత్రి నాటిన మొక్క పెద్ద మాను అయిందని, దాని చుట్టూ రచ్చబండ కట్టి అందరు తిలకించే విధంగా వాతావరణం కల్పించాలన్నారు.

తాను గతంలో నాటిన మొక్క ఎదుగుదలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ.ఏ.డి. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ లు రాశివనం లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, కమీషనర్లు దేవేందర్‌, రమేష్‌, జీవన్‌, ఇంచార్జి డి.ఎఫ్‌.ఓ. గోపాల్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »