కామారెడ్డి, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు, లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్‌లు మను చౌదరి, చంద్రమోహన్‌లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు, తెలంగాణకు హరితహారం, ఆసరా ఫించన్, గొర్రెల పంపిణీ, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గృహలక్ష్మి ,దళిత బంధు, ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, కారుణ్య నియామకాలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలపై సీఎస్ జిల్లా కలెక్టర్‌లకు పలు సూచనలు చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం లిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులతో సమీక్షిస్తూ, స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 1 న హైదరాబాద్‌లో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి జిల్లా నుంచి హాజరయ్యే విధంగా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలని కలెక్టర్ సూచించారు.
వృద్దాప్య, ఆసరా ఫించన్ దారులు మరణించిన పక్షంలో వారి భాగస్వామికి పెన్షన్ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, క్షేత్రస్థాయిలో పెండిరగ్‌లో ఉన్న ఆసరా ఫించన్ దరఖాస్తులను మూడు రోజుల్లో మంజూరు చేయాలని కలెక్టర్ తెలిపారు. గొర్రెల పంపిణీ పథకం క్రింద మన జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు.
బీసి కులవృత్తుల కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం మొదటి దశలో మంజూరైన చెక్కుల పంపిణీ పూర్తయి నందున, రెండవ దశ అమలుకు చర్యలు తీసుకోవాలని, రెండవ విడత లో ఆన్ లైన్ లో మాత్రమే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గృహలక్ష్మి పథకం క్రింద జిల్లాలో మొదటి దశ దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్దిదారుల జాబితా జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తీసుకొని మంజూరు చేయాలని, గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపిక, జిల్లా ఇంఛార్జి మంత్రిచే ఆమోదం, ఆన్‌లైన్ యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ వారం రోజులలో పూర్తి చేయాలని, అనంతరం ఇండ్ల నిర్మాణ పనులు మొదలు కాగానే మొదటి విడత లక్ష రూపాయల నిధులు విడుదల చేయడం జరుగుతుందని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
రెండవ విడత దళిత బంధు పథకం కింద జిల్లా మంత్రిచే ఆమోదించిన జాబితా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులని ఎంపిక చేయాలని అన్నారు. సమావేశంలో జెడ్పీ సి. ఈ. ఓ. సాయాగౌడ్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా బిసి అభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సింహరావ్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరెట్ పరిపాలన అధికారి మసుర్ అహ్మద్ పాల్గొన్నారు.