నిజామాబాద్, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధ్యాన్ చంద్ ను కేవలం క్రీడాకారుడిగా మాత్రమే చూడవద్దని అతని దేశభక్తి మనందరికీ అనుసరణీయమని జిల్లా పరిషత్ చైర్మన్ అన్నారు, ధ్యాన్ చంద్ ఆట తీరు చూసి ముగ్దులైన ఆనాటి జపాన్ ప్రధాని హిట్లర్ అతనికి జపాన్ పౌరసత్వంతో పాటు జపాన్ హాకీ జట్టు కెప్టెన్‌గా బాధ్యతను ఇస్తానని అడిగినా తన దేశం కోసమే ఆడుతాను తప్ప మరో దేశం కోసం ఆడనని తేల్చి చెప్పిన ధ్యాన్ చంద్ మనందరికీ ఆదర్శమన్నారు.
క్రీడా దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్న నెహ్రూ యువ కేంద్ర, జిల్లా క్రీడా శాఖ అధికారులను అభినందించారు. నుడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల కోసం ఎంతటి పోరాటానికైనా, క్రీడా మైదానాలను కాపాడుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని అన్నారు. ఆగస్ట్ 29 హాకీ మాంత్రికుడు, భారత హాకీ దిగ్గజం స్వర్గీయ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పలు క్రీడా పోటీలలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మంగళవారం ఉదయం 7గంటలకు నాగారం రాజారాం స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీలు 100 మీ, 200 మీటర్ల పరుగు పందెం, శూలం విసురుట, లాంగ్ జంప్, షాట్ ఫుట్ లలో పోటీలు జరిగాయి. కలెక్టర్ గ్రౌండ్‌లో హాకీ పోటీలు జరిగాయి, హాకీలో మొత్తం 6 జట్లు పాల్గొన్నాయి, మొత్తం క్రీడల్లో 128 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, స్థానిక కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులందరికి నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేశారు. పోటీల అనంతరం అన్ని పోటీలలో విజేతలకు జిల్లా పరిషత్ చైర్మన్, నుడా చైర్మన్, జిల్లా అధికారుల చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్‌లు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, జిల్లా క్రీడా అధికారి ముత్తన్న, హాకీ అసోసియేషన్ కార్యదర్శి రమణ, కోశాధికారి సురేందర్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు.