కామారెడ్డి, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి అపోహలకు తావులేకుండా తప్పులులేని, స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించుటలో అన్ని రాజకీయపార్టీల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఓటరు జాబితా రూపకల్పన, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు.
ఈ నెల 26,27 న ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలు, తొలగింపులపై నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 3,358 దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలిస్తున్నామని అన్నారు. తిరిగి సెప్టెంబర్ 2,3 తేదీలలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నామని, బూత్ స్థాయి అధికారాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓరు ముసాయిదా జాబితా తో పాటు, ఫారం-6,7,8 లతో అందుబాటులో ఉంటారని అన్నారు. రాజకీయపార్టీలు ప్రతి బూతు స్థాయిలో తమ ఏజెంట్ లను నియమించుకొని ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధుల పేర్లు తప్పిపోకుండా చూడాలన్నారు.
డూప్లికేట్, షిఫ్టింగ్, చనిపోయిన ఓటరు వివరాలు ఉంటే తెలపాలని కోరారు. ఒకే ఇంటిలోని ఓటర్లు విడిపోకుండా ఒకే పోలింగ్ బూతులో ఉండేలా చూడాలన్నారు. సెప్టెంబర్ 19 వరకు ఆక్షేపణలు, అభ్యంతరాలను స్వీకరించి, 28న పరిష్కరిస్తామని, అక్టోబర్ 4 న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని అన్నారు. ఓటరు నమోదుకు ఫ్లెక్సీలు, బ్యానర్ల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని, కళాశాలలో స్వీప్ ద్వారా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తు మహిళ, యువతి ఓటర్ల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏళ్ళు నిండే యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలని రాజకీయ ప్రతినిధులను కోరారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మదన్ లాల్ జాదవ్, అనిల్ కుమార్, మీర్జా హఫీజ్ బేగ్, అవధూత నరేందర్, కాసిం అలీ, స్వామి, బాలరాజు, ఎలక్షన్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.