డిచ్‌పల్లి, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (ఫైనల్) తుది సెమిస్టర్ ఫలితాలను రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను పురస్కరించుకొని రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలో 40.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.
మొత్తం డిగ్రీ పరీక్షలకు 9026 మంది హాజరు కాగా 3658 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారని పేర్కొన్నారు. ఇందులో అధికంగా 51.80 శాతంతో బాలికలు ముందున్నారని పేర్కొన్నారు. బాలురు 24.16 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు రిజిస్టార్ ఆచార్య యాదగిరి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్. శాంతాబాయి, డాక్టర్ నందిని, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్, డైరెక్టర్ (పిఆర్‌ఓ) డా.ఏ పున్నయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరీక్ష ఫలితాలను వేగవంతం చేసిన ఎగ్జామ్ బ్రాంచ్ అధికారులను, ఉద్యోగులను వైస్ ఛాన్స్‌లర్ వాకాటి కరుణ అభినందించారని రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి తెలిపారు.