కామారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్ స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలోని 106,107, తాడ్వాయిలోని 108,109 లింగంపేటలోని వివిధ పోలింగ్ బూతులను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు.
బి.ఎల్.ఓ. ల వద్ద ముసాయిదా ఓటరు జాబితా, అవసరం మేర ఫారం-6,7,8 అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఈ సందర్భముగా ఓటరు నమోదుకు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు వస్తున్న దరఖాస్తులను పరిశీలించారు. ఆదివారం కూడా ప్రత్యేక శిబిరాలు అన్ని పోలింగ్ బూతులలో కొనసాగుతాయని, ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది పరిశీలించుకోవాలన్నారు. లేనివారు వెంటనే ఫారం-6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వివిధ రాజకీయ పార్టీలు కూడా బూతు స్థాయిలో ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలించి ప్రముఖుల పేర్లు మిస్ కాకుండా చూసుకోవాలన్నారు. మార్పులు,చేర్పులు, తొలగింపులు ఏమైనా ఉంటె బూత్ స్థాయి అధికారులకు తెలపాలన్నారు. ఈ నెల 19 వరకు ఓటరు నమోదు తో పాటు మార్పులు,చేర్పులకు అవకాశం ఉంటుందని, 18-19 ఏళ్ళు నిండిన మహిళలు ఓటరుగా నమోదు చేసుకోవడంలో అవగాహన కలిగించాలన్నారు. ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మేర జనాభా, ఓటరు నిష్పత్తి, లింగ నిష్పత్తి ఉండే విధంగా చూడాలని అన్నారు.
ప్రత్యేక శిబిరాల అనంతరం బూతు స్థాయి అధికారులు, సూపర్వైజర్లు ఇంటింటా సర్వే చేపట్టి అర్హత గల ఏ ఒక్క ఓటరు మిగిలిపోకుండా ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటర్ టర్న్ అవుట్ తక్కువగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఓటరు జాబితాలో పేర్లు తొలగించే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మృతి చెందిన వారి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యుల నుండి సేకరించి క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.
డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, ఒక నియోజక వర్గం నుండి మరొ నియోజక వర్గానికి మార్పు, శాశ్వతంగా చిరునామా మార్పు, ఒకే ఇంట్లోని వారందరు ఒకే పోలింగ్ బూత్ లో ఓటర్లుగా ఉండేలా చూడాలన్నారు. వివిధ కారణాల వల్ల ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు మారినట్లైతే, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ఓటర్లకు తెలియజేయాలని, తద్వారా వారు పోలింగ్ సమయంలో గందరగోళానికి గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోగల్గుతారని కలెక్టర్ అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ఓటరుగా నమోదయిన ప్రతి ఒక్కరు ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు. గత నెల 26,27 తేదీలలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో వచ్చిన అభ్యంతరాలు, ఆక్షేపణలను, నేడు, రేపు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 28 లోగా పరిష్కరించి అక్టోబర్ 4 న తప్పులు లేని, పారదర్శకమైన తుది ఓటరు జాబితా విడుదలచేస్తామని అన్నారు.