కామారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న నిర్వహించనున్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులకు సూచించారు.
టెట్ పరీక్ష నిర్వహణ సన్నద్ధతపై శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ టెట్ పరీక్ష ఈ నెల 15 న ఉదయం, మధ్యాన్నం రెండు సెషన్స్‌లలో జరుగుతుందని అన్నారు. ఉదయం 9. 30 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు జరిగే మొదటి సెషన్‌లో 5,535 అభ్యర్థులు, మధ్యాన్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే రెండవ సెషన్ లో 4,205 అభ్యర్థులు పరీక్ష వ్రాయనున్నారని, ఇందుకోసం కామారెడ్డి పట్టణంలో 24 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్‌లు, హాల్ సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్లను, నాలుగు రూట్లలో ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించుటకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరీక్షలు వ్రాసే అభ్యర్థులు సులువుగా పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకునేలా బస్టాండ్ ఆవరణలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు.
యెల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల నుండి అభ్యర్థులు పరీక్ష సమయానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రథమ చికిత్స శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలు, చుట్టూ ప్రక్కల ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని, చెత్తను తొలగించాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు,పటిష్ట పొలిసు బందోబస్త్ ఏర్పాటు చేయాలనీ రెవెన్యూ, పొలిసు అధికారులకు సూచించారు.
కాగా హాల్ టికెట్ పై ఫోటో రాని అభ్యర్థులు గజిటెట్ అధికారిచే అటెస్ట్ చేయించిన రెండు ఫోటోలు తేవాలని సూచించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలోగా చేరుకోవాలని, క్షణం ఆలస్యమైన పరీక్ష హాలులోకి అనుమతించబడరని స్పష్టం చేశారు. అభ్యర్థులు సెల్ ఫోన్, వాచీలు, క్యాలికులేటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెస్ అనుమతించబడవని కలెక్టర్ స్పష్టం చేశారు.
సమావేశంలో డీఈఓ రాజు, డిఎస్పీ మదన్ లాల్, ప్రభుత్వ పరీక్షల సహాయకమీషనర్ లింగం, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర, జిల్లా ఖజానా అధికారి సాయిబాబు, మునిసిపల్ కమీషనర్ వాసుదేవ రెడ్డి, విద్యుత్ శాఖ డీఈఈ రంగయ్య, కలెక్టరేట్ ఏ.ఓ. సయీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.