నిజామాబాద్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ పరిశీలన జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. డబుల్ ఎంట్రీ, బోగస్ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్.ఓ మొదలుకుని ఈ.ఆర్.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు సైతం జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఈ.ఓ సమీక్ష జరిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇంటింటికి తిరిగి పరిశీలన జరిపే ప్రక్రియను పూర్తి చేయించాలన్నారు. మార్పులు-చేర్పులకు సంబంధించి పెండిరగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, రోజువారీగా పరిష్కరించాలని, వాటిని ఆన్లైన్ లో అప్ లోడ్ చేయించాలన్నారు. ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్న సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిశీలన ప్రక్రియ ఏ దశలో ఉందన్న వివరాలను ఆరా తీశారు.
ఈ విషయమై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందిస్తూ, జిల్లాలో మొదటి రెండు రోజులు నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా 5600 దరఖాస్తులు క్షేత్రస్థాయిలో దాఖలు అయ్యాయని సీఈఓ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం మలివిడతలోనూ దాదాపు అంతే సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓ ల స్థాయిలో పెండిరగ్లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిశీలన జరిపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాగా, కొత్తగా నమోదైన ఓటర్లకు నిర్దిష్ట గడువులోపు గుర్తింపు కార్డులు చేరేలా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని, ఈ-ఓటరు ఐ.డీని హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చుననే విషయాన్ని ఓటర్లకు తెలియజేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఈఓ సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జాగ్రత్తగా గుర్తించాలని, షెడ్యూల్డ్ కులాలు, తెగల సమూహాలు ఉండే ప్రాంతాలతో పాటు వయో వృద్దులు, సెక్స్ వర్కర్లు, దివ్యంగులైన ఓటర్లు పోలింగ్ లో పాల్గొనేలా ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గడిరచిన ప్రముఖులతో అవగాహన కల్పిస్తే సత్ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 18 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ,యువకులు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ సందర్భంగా ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో వీ.సీ ముగిసిన మీదట కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓలు, తహశీల్దార్లతో సమీక్ష జరిపారు. ఓటరు జాబితా పక్కాగా రూపొందేలా అన్ని స్థాయిలలో పకడ్బందీ పరిశీలన జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా 18 – 19 సంవత్సరాల వారు ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు.
ఈ మేరకు కళాశాలల నిర్వాహకులు, విద్యార్థులతో అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, చిత్రామిశ్రా, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, డీసీఓ సింహాచలం, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, వినోద్ కుమార్, భుజంగరావు, సహాయ ఈ.ఆర్.ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.