నిజామాబాద్, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరిన గోదావరి వరద జలాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు రంగు మారి కలుషితం అయ్యిందనే ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం శ్రీరాంసాగర్ ను సందర్శించి ప్రాజెక్టులోని నిలువ నీటిని స్వయంగా పరిశీలించారు.
డ్యాం సైట్ పైనే సంబంధిత శాఖల అధికారులతో తాజా పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ లోని నీరు పచ్చ రంగులో మారినప్పటికీ, ఎలాంటి హానికరమైన వ్యర్ధాలు కలవలేదని, ప్రాజెక్టు జలాలు కలుషితం కాలేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మిషన్ భగీరథ కింద తాగునీటి కోసం వినియోగించే సుమారు 10 ఇంటెక్ వెల్ పాయింట్ల వద్ద నుండి గోదావరి జలాల శాంపిల్స్ సేకరించి అవసరమైన పరీక్షలు నిర్వహించగా, వినియోగానికి అనువైనవిగానే ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు బాసర, యంచ తదితర ప్రాంతాల వద్ద నుండి కూడా శాంపిల్స్ సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా, జలాలు కలుషితం కాలేదని వెల్లడైందని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ జలాలను తాగునీటి అవసరాలతో పాటు పంటల సాగుకు వినియోగించినప్పటికీ, ఎలాంటి హాని ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ నీటి శాంపిల్స్ ను మరోమారు సేకరించి సమగ్ర పరీక్షల కోసం సంగారెడ్డిలోని ల్యాబ్ కు పంపించాలని కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సారెస్పీ నీటి స్వచ్ఛత విషయమై పలు పత్రికలలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని సమీక్షించడం జరిగిందన్నారు. ఆయకట్టు రైతులు, ప్రజల నుండి ఎస్సారెస్పీ నీటి విషయంలో ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఎక్కడ కూడా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని తెలిపారు. జలాలు కలుషితం కాలేదని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు నిర్వహించిన పరీక్షల్లోనూ వెల్లడైందని అన్నారు.
ప్రజలు, ఆయకట్టు రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. అయినప్పటికీ శ్రీరాంసాగర్ నీటిలో ఆక్సిజన్ శాతం తదితర ప్రమాణాలను పరిశీలించేందుకు వీలుగా కాలుష్య నియంత్రణ మండలి ద్వారా సమగ్ర పరీక్షలు జరిపించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. కలెక్టర్ వెంట ఎస్సారెస్పీ ఎస్.ఈ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.