కామారెడ్డి, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా బూతు స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం బిక్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో 135,137,138,141, 142 పోలింగ్ బూతులను ఆకస్మికంగా సందర్శించి ప్రత్యేకశిబిరాల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు.
ఓటర్ల నమోదు, జాబితా నుండి పేర్ల తొలగింపు, మార్పులు-చేర్పుల కోసం పాటిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకుని, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏళ్ళు నిండే ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ మహిళా ఓటర్ల నమోదులో ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
డబుల్ ఓటర్ల పేర్లు రాకుండా జాగ్రత్తగా చూడాలని, మరణించిన వారి పేర్ల తొలగింపులో కుటుంబ సభ్యుల నుండి మరణ ధ్రువపత్రం పొందిన తరువాతే నోటీసు ఇచ్చి తొలగించాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే, వారందరినీ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి చేర్చాలని కలెక్టర్ సూచించారు.
ఓటరు నమోదు, మార్పులు-చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా వెంట వెంటనే బీ.ఎల్.ఓ యాప్ ద్వారా వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. ప్రత్యేక శిబిరాల అనంతరం ఇంటింటి సర్వే చేపట్టి శతశాతం అర్హులైన ఓటర్లు నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటరు నమోదుతో పాటు అభ్యంతరాలు,ఆక్షేపణలు, మార్పులు,చేర్పులను ఈ నెల 19 వరకు అవకాశం ఉందన్న విషయంపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.
ప్రత్యేక డ్రైవ్ తో పాటు ఈ నెల 19 వరకు వచ్చే ఫారం-6,7,8 లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అక్టోబర్ 4 న తప్పులు లేని, పారదర్శకమైన ఓటర్ల తుది జాబితా విడుదలకు గాను నూతన ఓటర్ల నమోదు,సవరణల ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కాగా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ కామారెడ్డి పట్టణంలోని 252,253 పోలింగ్ బూతులు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, బిక్నూర్ తహశీల్ధార్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.