కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించిన వారే మన్ననలు పొందగలుగుతామని, ఆ దిశగా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిష్కార దిశగా కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్‌డిఓ సాయన్న, కలెక్టరేట్ ఏ.ఓ. సయ్యద్ మసూద్ అహ్మద్‌తో కలిసి సమస్యల పరిష్కార నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల సమస్యలను సావదానంగా వింటూ పరిష్కరింపదగిన వాటిపై తగు చర్యకై అధికారులకు అట్టి వినతులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్జీలను పెండిరగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరింపదగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని వాటికి పరిష్కార మార్గాలు సూచించాలని అన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి 24 వినతులు వచ్చాయి. అందులో ప్రధానంగా భూ సమస్యలు, భూ సర్వే, ధరణికి సంబందించిన ఎక్కువ వినతులు వస్తున్నాయని, మండల స్థాయిలో తహశీల్ధార్లు వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.
సంబంధిత అధికారులు కూడా ప్రజావాణిలో వచ్చే వినతులకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తూ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.