కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలలో ఓటరు నమోదును ప్రోత్సహించడానికి మీ సృజనాత్మకతకు అనుగుణంగా చక్కటి పోస్టర్, చిన్న నిడివి గల వీడియో రూపొందించి పంపవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎన్నికల పేర పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉన్నదో లేదో తెలుసుకొని ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించుటకు సులభంగా అర్ధమయ్యే రీతిలో రూపొందించిన పోస్టర్, 60 సెకండ్ల నిడివి గల వీడియోల కొరకు ఎంట్రీలు ఆహ్వానిస్తున్నదని ఆయన తెలిపారు.
అయితే చిహ్నాలు, రంగులు, నాయకులు మొదలైన రాజకీయ అర్థాలతో కూడిన ఎంట్రీలు పరిగణింపబడవని కలెక్టర్ స్పష్టం చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఏ భాషలోనైనా పోస్టర్, వీడియో రూపొందించి పంపవచ్చని, విజేతలకు 20 వేల నగదు బహుమతి కూడా అందజేయబడుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు మీ ఊహలు, సృజనాత్మకతకు పదునుపెట్టి చక్కటి పోస్టర్, వీడియో రూపొందించి ఈ నెల 16 లోగా తమ ఎంట్రీలను ttps://tinyurl.com/electioncrea-thon2023
వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.