నిజామాబాద్, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు , అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, డీఆర్డీఓ చందర్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ, ప్రజావాణి సైట్‌లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోషణ్ అభియాన్ పోస్టర్ల ఆవిష్కరణ
బాలింతలు, శిశువుల ఆరోగ్యం కోసం సమతుల పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ పోషణ్ అభియాన్ లో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. ఈ నెల 01 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా పౌష్టిక, సమతుల ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, ఐసీడీఎస్ పీ.డీ రసూల్ బీ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, డీఎస్సీడీఓ శశికళ తదితరులు పాల్గొన్నారు.