కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని, సకాలంలో ఇమ్మునైజేషన్ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పోషన్ మాసోత్సవంలో భాగంగా ఈ నెల 1 నుండి 30 వరకు షెడ్యూల్ ప్రకారం చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయుటకు సంబంధిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
పోషన్ మాసోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై మహిళా శిశు సంక్షేమం అనుబంధ శాఖలతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరితో కలిసి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన సమతుల పౌష్టికాహారం, తల్లిపాల ఆవశ్యకత, కిశోర బాలికలలో రక్తహీనతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రోజువారీ చేపట్టు మాసోత్సవ కార్యక్రమాలలో ఆశా వర్కర్లు, ఏ.యెన్.ఏంలు, పంచాయతీ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు చురుకుగా పాల్గొని సమతుల ఆహారానికి పాలు, గ్రుడ్లు, చిరుధాన్యాల ఆవశ్యకతను వివరించాలన్నారు.
ఇట్టి కార్యక్రమాలలో ప్రజాప్రతినిదులను భాగస్వాములను చేయాలని సూచించారు. రక్తహీనతపై పాఠశాల స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని డిఈఓ కు సూచించారు. పిల్లల ఎత్తు, బరువులు పరీక్షించి తీవ్ర పోషక లోపం ఉన్న పిల్లలు (సామ్ ), వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు లోపం (మామ్) ఉన్న పిల్లలను గుర్తించి గ్రుడ్లు, బాలామృతం తీసుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు.
ఎంతో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల పట్ల వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కల్గించాలని జిల్లా వ్యవసాయాధికారికి సూచించారు. బుధ, శనివారాలలో ఆరోగ్య కార్యకలాపాలు చూడాలని డిఎమ్‌అండ్‌హెచ్‌ఓకు సూచించారు. గిరిజన, మైనారిటీ, జిల్లా పౌర సరఫరాలు తదితర శాఖలు కూడా తమ కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి శాఖ కూడా ఎటువంటి ఫిర్యాదులకు తావులేకుండా కార్యాచరణ మేరకు నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని హితవు చెప్పారు.
చేసిన ప్రతి కార్యక్రమం డాక్యుమెంటేషన్‌లో ఉండేలా చూడాలని, నాటి పనిని ఆన్ లైన్ లో ఫోటోతో పాటు వివరాలు అప్‌లోడ్ చేయాలని సూచించారు. భేటీ బచావో భేటీ పడావో పధకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయుటకు తుది కార్యాచరణ రూపొందించవలసినదిగా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ రక్తహీనత, సమతుల పౌష్టికాహారంపై తీసుకోవలసిన జాగ్రత్తలపై రూపొందించిన గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో అధికారులు సాయన్న, బావయ్య, లక్ష్మణ్ సింగ్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ రెడ్డి, అనిల్‌కుమార్, నవీన్, రమేష్‌బాబు, షహీన్ బేగం, తదితరులు పాల్గొన్నారు.